BJP: బీజేపీ నేతలే దాడి చేశారు: అలిపిరి ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
- టీడీపీ కార్యకర్తలు శాంతియుతంగానే నిరసన తెలిపారు
- అమిత్ షాపై బీజేపీ నేత కోలా ఆనంద్ అనుచరులే దాడి
- టీడీపీపై కుట్రలు పన్నుతున్నారు
శ్రీవారిని దర్శించుకుని వెళుతోన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై తిరుపతిలోని అలిపిరి వద్ద పలువురు రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ కార్యకర్తలు శాంతియుతంగానే నిరసన తెలిపారని, ఆ రోజు అమిత్ షాపై బీజేపీ నేత కోలా ఆనంద్, అతని అనుచరులే దాడి చేశారని ఆరోపించారు.
ఒకవేళ తాము దాడి చేయాలని అనుకుంటే అమిత్ షా కాన్వాయ్‌నే అడ్డుకునే వారిమని అన్నారు. తమ పార్టీపై బీజేపీ, వైసీపీ నేతలు కలిసి కుట్రలు పన్నుతున్నారని, అలిపిరిలో తెలిపిన నిరసనను రాజకీయం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తోన్న ధర్మ పోరాట దీక్షలు జయప్రదం కావాలని ఆయన ఆకాంక్షించారు.
కాగా, అంతకు ముందు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసి, రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు.