Mallikarjun Kharge: కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేందుకే దళిత సీఎం అంశాన్ని తెచ్చారు: మల్లికార్జున ఖర్గే
- దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది
- స్పష్టం చేసిన ఖర్గే
- నిజంగా దళిత అభ్యర్థినే సీఎం చేయాలనుకుంటే పోటీలో ఖర్గే
కాంగ్రెస్ పార్టీలో విభేదాలను రగిల్చేందుకే దళిత ముఖ్యమంత్రి అంశాన్ని మీడియా తెరపైకి తెచ్చిందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. పార్టీ దళిత నేతను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే తాను ఆ పదవిని వదులుకునేందుకు సిద్ధమేనని సిద్ధరామయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఖర్గే స్పందించారు. ‘‘మా మధ్య విభేదాలు సృష్టించేందుకు ఈ అంశాన్ని మీడియా తెరపైకి తెచ్చింది. మేం చాలా స్పష్టంగా ఉన్నాం. అధిష్ఠానం దీన్ని నిర్ణయిస్తుంది. ఇది 12 గంటల్లో జరిగేపోయే పని’’ అని ఖర్గే స్పష్టం చేశారు.
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి శనివారం పోలింగ్ ముగియగా, రేపు (మంగళవారం) ఫలితాలు వెల్లడి కానున్నాయి. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కర్ణాటక రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని తెలిపిన విషయం గుర్తుండే ఉంటుంది. అయినప్పటికీ అటు బీజేపీ, ఇటు అధికార కాంగ్రెస్, జేడీఎస్ మూడు కూడా తామే అధికారంలోకి వస్తామని ఇప్పటికీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించి నిజంగా దళిత అభ్యర్థినే ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే అందుకు పార్లమెంటరీ నేతగా ఉన్న ఖర్గే ప్రధాన అభ్యర్థిగా ముందుంటారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.