Karnataka: దళితుడికి సీఎం పదవి అప్పగించేందుకు రెడీ: సీఎం సిద్ధరామయ్య
- ఒకవేళ కర్ణాటకలో ‘హంగ్’ ఏర్పడితే ఏం చేయాలనే దానిపై దృష్టి
- జేడీఎస్ మద్దతు కోసం ‘కాంగ్రెస్’ వ్యూహం
- ఆ పార్టీ మద్దతు కోసమే ఈ ప్రకటన చేసిన సిద్ధరామయ్య?
కర్టాటక అసెంబ్లీ ఎన్నికలు నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమదే విజయం అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష, విపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేశాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ వస్తుందని తేలింది. ఒకవేళ హంగ్ అసెంబ్లీ వస్తే జేడీఎస్ కింగ్ మేకర్ అయ్యే అవకాశముంది. ఈ ఫలితాలు నిజమై..‘హంగ్’ ఏర్పడితే ఏం చేయాలనే దానిపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి.
ఈ నేపథ్యంలో జేడీఎస్ మద్దతు కోసం ‘కాంగ్రెస్’ వ్యూహం సిద్ధం చేస్తోంది. ఈ సందర్భంగా సీఎం సిద్ధ రామయ్య ఓ కీలక ప్రకటన చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని దళితుడికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పదవిని ఎవరికి కట్టాబెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకునేది అధిష్ఠానమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్ధరామయ్య ఓ మెలిక పెట్టారు.
గెలిచిన ఎమ్మెల్యేల మాటను అధిష్ఠానం వినాలని, వారి ఇష్టాయిష్టాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని దళితుడికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఒకవేళ ‘హంగ్’ ఏర్పడితే.. జేడీఎస్ మద్దతు కోసమే సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.