Lalu Prasad: తేజ్ ప్రతాప్ పెళ్లిలో అరుదైన దృశ్యం.. నితీశ్‌ను హత్తుకున్న లాలు!
- ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న లాలు-నితీశ్
- పెళ్లికి హాజరైన పలువురు ప్రముఖులు
- డుమ్మా కొట్టిన రాహుల్, మమత
ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్‌ప్రతాప్ వివాహ వేడుకలో అరుదైన దృశ్యం కనిపించింది. రాజకీయ ప్రత్యర్థులుగా మారిన ఒకప్పటి మిత్రులు లాలు ప్రసాద్ యాదవ్-నితీశ్ కుమార్ ఆప్యాయంగా హత్తుకున్నారు. తమ మధ్య బ్రేకప్ అయిన తొమ్మిది నెలల తర్వాత కలుసుకున్న ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలకరించుకుని ఆలింగనం చేసుకున్నారు.
ముఖ్యమంత్రి నితీశ్ 30 నిమిషాలు అక్కడే గడిపారు. వధూవరులు తేజ్‌ప్రతాప్-ఐశ్వర్యతో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. లాలూకు ప్రత్యర్థిగా మారిన మరో నేత, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్ కూడా పెళ్లికి హాజరుకావడం గమనార్హం. కాగా పెళ్లికి ఆహ్వానించిన వారిలో పలువురు ముఖ్యనేతలు డుమ్మా కొట్టారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ హాజరు కాలేదు. ఇక కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్‌లు పెళ్లి తంతు పూర్తయ్యాక సాయంత్రానికి చేరుకున్నారు.
శనివారం మధ్యాహ్నానికి రెండు చార్టెడ్ విమానాలు పాట్నా చేరుకున్నాయి. తొలి విమానంలో పారిశ్రామికవేత్త, మీడియా దిగ్గజం, ఎస్సెల్ గ్రూప్ అధినేత, రాజ్యసభ సభ్యుడు సుభాష్ చందర్ రాగా, మరో విమానంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్, ముగ్గురు పిల్లలు వచ్చారు. బరాత్ పూర్తయిన వెంటనే తిరిగి వెళ్లిపోయారు. వీరితోపాటు ఎన్సీపీ నేత, మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్, కేంద్ర మంత్రులు ఆర్కే సింగ్, పాశ్వాన్, బీజేపీ ఎంపీ, నటుడు శత్రుఘ్న సిన్హా, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తదితరులు పెళ్లికి హాజరయ్యారు.