Andhra Pradesh: అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలి: ఏపీ డిప్యూటీ సీఎం కేఈ
- దక్షిణ భారతాన్ని విస్మరించడం తగదు
- ఏపీకి కేంద్రం ఏమిచ్చిందో చెప్పాలి?
- శ్వేతపత్రం విడుదల చేయాలి
అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలని, ఉత్తర భారతాన్ని అభివృద్ధి చేసి దక్షిణ భారతాన్ని విస్మరించడం తగదని..ఇలా అయితే, రాబోయే రోజుల్లో భారతదేశంలో ఏం జరుగుతుందో చెప్పలేమని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర పరిస్థితి గురించి అనేకసార్లు కేంద్రానికి విన్నవించినప్పటికీ ప్రయోజనం కనిపించలేదని, ఎన్నికల నాటి వాగ్దానాలను పక్కనపెట్టి కక్ష సాధింపు చర్యలకు దిగడం తగదని మండిపడ్డారు.
ఏపీకి కేంద్రం ఏమిచ్చిందో చెప్పాలని, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే చంద్రబాబుకు పేరొస్తుందని చెప్పి కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ వల్ల బాగుపడ్డ బీజేపీతో తమ పార్టీకి ఒనగూరిన ప్రయోజనం శూన్యమని కేఈ మండిపడ్డారు.