chandigarh: మే 30 వరకు మూతపడ్డ చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
- ఈ రోజు నుంచి మే 30 వరకు మూసివేత
- రన్ వే విస్తరణతో పాటు ఇతర మరమ్మతుల పనులే కారణం
- లక్షకు పైగా ప్రయాణికులపై ప్రభావం
ఈ రోజు నుంచి మే 30వ తేదీ వరకు చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును మూసి వేశారు. రన్ వే విస్తరణ, ఇతర మరమ్మతుల నిమిత్తం విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రన్ వే పొడవును 9వేల అడుగుల నుంచి 10,400 అడుగులకు పెంచనున్నారు. మరమ్మతులు కొనసాగే కాలంలో సివిల్ తో పాటు మిలిటరీ విమానాల రాకపోకలు కూడా ఉండవని చెప్పారు. విమాన రాకపోకలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో లక్షకు పైగా ప్రయాణికులు ప్రభావితం కానున్నారు. ముఖ్యంగా వేసవి సెలవుల సమయం కావడంతో ప్రయాణికులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
చండీగఢ్ విమానాశ్రయంలో ఈ మరమ్మతుల కార్యక్రమాన్ని చేపట్టడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 12 నుంచి 26 వరకు ఇంతకు ముందు మరమ్మతులను చేపట్టారు. రన్ వే పొడవు పెరిగితే భారీ విమానాల రాకపోకలకు వీలు కలుగుతుంది. దీంతో, యూఎస్, యూరప్, ఆస్ట్రేలియాలకు నేరుగా విమాన సర్వీసులను నడిపే వీలుంటుంది.