amit shah: అమిత్ షా ఘటనలో రాయి విసిరింది టీడీపీ కార్యకర్తే అని తేలితే సస్పెండ్ చేస్తా!: చంద్రబాబు
- హోదా కోసం ఆందోళనలు, పోరాటాలు చేయాల్సిందే
- అయితే, అవి శాంతియుతంగా ఉండాలి
- రాయి విసిరింది టీడీపీ కార్యకర్త అని తేలితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తిరుగుపయనం అవుతుండగా... అలిపిరి వద్ద ఆయన కాన్వాయ్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు, పోరాటాలు చేయాల్పిందేనని... అయితే, అవి శాంతియుతంగా జరగాలని ఆయన అన్నారు. ఈ ఘటనలో రాయి విసిరింది టీడీపీ కార్యకర్తే అని తేలితే... పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పారు.
అమిత్ షా ఎదుట నిరసన తెలిపితే ప్రత్యేక హోదా పోరుకు మరింత బలం చేకూరుతుందని తిరుపతికి చెందిన సుమారు 30 మంది అలిపిరి వద్దకు వెళ్లారు. అయితే అమిత్ షాతో పాటు మొత్తం కాన్వాయ్ వెళ్లిపోయుంటే ఏ సమస్యా ఉండేది కాదు. చివర్లో ఒక వాహనాన్ని నిలిపివేయడం, ఆ వాహనంలో ఉన్న ఓ బీజేపీ నేత వాగ్వాదానికి దిగడంతో అక్కడ గొడవ ముదిరింది. ఒకరిద్దరు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసినట్టు తెలిసింది. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు చేయి చేసుకోవడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టైంది.