Karnataka: కర్ణాటకలో ప్రారంభమైన పోలింగ్.. పూజలు చేసిన బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప
- ఎండ తీవ్రత దృష్యా ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు
- సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్
- రెండు స్థానాలు మినహా 222 స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్
దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రెండు స్థానాలు మినహా మొత్తం 222 స్థానాల్లో పోలింగ్ మొదలైంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎండలు మండిపోతుండడంతో పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు గంటల వరకు పొడిగించారు. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 8 నుంచి పది పోలింగ్ కేంద్రాలకు ఎస్పీ స్థాయి ఉన్నతాధికారిని నియమించారు.
222 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా 58,008 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,984 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక మొత్తం పోలింగ్ బూత్‌లలో 534 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 12 వేలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1.5లక్షల మంది పోలీసులు, 50 వేల మంది కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు.
పోలింగ్‌కు ముందు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 17న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.