Supreme Court: అన్ని కోర్టుల్లోనూ లైంగిక వేధింపుల నిరోధక కమిటీల ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం

  • తనను కొందరు లాయర్లు వేధించారంటూ ఓ మహిళా న్యాయవాది పిటిషన్
  • స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించిన సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా అన్ని కోర్టులలో లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీలను 2013 నాటి చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ ను ఢిల్లీ హైకోర్టుతోపాటు దేశ రాజధానిలోని అన్ని జిల్లా కోర్టుల్లో వారంలోగా ఈ కమిటీలను నియమించాలని ప్రత్యేకంగా కోరింది.

ఢిల్లీకి చెందిన ఓ మహిళా న్యాయవాది.. సమ్మె సందర్భంగా తీస్ హజారి జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో కొంత మంది లాయర్లు తనను వేధించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సదరు పిటిషన్ ను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ తో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది.

బాధిత మహిళా న్యాయవాది, బార్ కౌన్సిల్ లీడర్లు కలసి స్నేహపూర్వకంగా తమ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇరు వర్గాల న్యాయవాదులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడంతో, ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయరాదని కోర్టు ఆదేశించింది. సంబంధిత ఫిర్యాదులపై విచారణ జరపాలని ఢిల్లీ క్రైమ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను పాటియాలా హౌస్ కోర్టుకు బదిలీ చేసింది.

  • Loading...

More Telugu News