Zaira Wasim: నిత్యమూ ఆత్మహత్య ఆలోచనలే... ఒత్తిడి భరించలేకున్నా: 'దంగల్' భామ జైరా వాసిమ్
- ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు పెట్టిన జైరా
- నిద్ర పట్టక, ఏవేవో ఆలోచనలు పీడిస్తున్నాయి
- 25 ఏళ్లు వచ్చే వరకూ ఇంతేనేమో: జైరా
తీవ్రమైన ఒత్తిడిలో తానున్నానని, నిత్యమూ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలని అనిపిస్తోందని 'దంగల్' చిత్రంతో స్టార్ డమ్ తెచ్చుకున్న నటి జైరా వాసిమ్ వాపోయింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, తానిప్పుడు జీవితంలోని అత్యంత కీలకమైన దశలో ఉన్నానని, అధిక ఒత్తిడి తనను పీడిస్తోందని, ఇది తగ్గడానికి మందులు కూడా వాడుతున్నానని తెలిపింది. తన పరిస్థితి తనకెంతో సిగ్గని పిస్తోందని, ఈ విషయాన్ని నలుగురిలో చర్చించడానికి తానేమీ ఇబ్బంది పడటం లేదని తన సుదీర్ఘ పోస్టులో వెల్లడించింది.
రోజుకు 5 యాంటీ డిప్రెస్ మాత్రలు వాడుతున్నానని, ఆత్రుత మరీ ఎక్కువై పోయి, కడుపులో ఖాళీగా ఉన్నట్టు అనుభూతి ఏర్పడుతోందని, విశ్రాంతి లేనట్టుగా అనిపిస్తుందని, నిద్ర పట్టదని, ఏవేవో ఆలోచనలు పిచ్చెక్కిస్తుంటాయని, రాత్రి పూట తనను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లిన సందర్భాలూ ఉన్నాయని తెలిపింది. 'దంగల్' చిత్రం తరువాత ఈ పరిస్థితి పెద్దగా ఏర్పడలేదని, 'సీక్రెట్ సూపర్ స్టార్' తరువాత మరింతగా పెరిగిపోయిందని, తనకిప్పుడు 17 ఏళ్లు మాత్రమేనని గుర్తు చేస్తున్న డాక్టర్లు, తనకున్న మానసిక రుగ్మత గురించి పూర్తిగా తెలియాలంటే 25 ఏళ్లు వచ్చే వరకూ ఆగాలని సలహా ఇస్తున్నారని చెప్పింది. తనకు 25 సంవత్సరాలు వచ్చే వరకూ ఇంతేనేమోనని, ఈలోగా ఏమైపోతానోనని వాపోయింది. తనకు ప్రతి విషయం నుంచి దూరంగా జరిగిపోవాలని ఉందని, ముఖ్యంగా సోషల్ మీడియా వద్దే వద్దనిపిస్తోంది చెప్పుకొచ్చింది.