Karnataka: 'గాలి' కేసుల డీల్ కు సంబంధించిన వీడియోలు.. కర్ణాటక ఎన్నికల క్లైమాక్స్ వేళ బీజేపీకి భారీ షాక్!
- మైనింగ్ కేసుల కొట్టివేతకు రూ.160 కోట్ల డీల్
- సుప్రీం ప్రధాన న్యాయమూర్తి అల్లుడితో శ్రీరాములు మంతనాలు
- సంచలనం సృష్టిస్తున్న నాలుగు వీడియోలు
కర్ణాటక ఎన్నికలు తుది అంకానికి చేరుకున్న వేళ.. గెలుపుపై కమలనాథులు ఆశలు పెట్టుకున్న సమయాన.. ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితుడైన గాలి జనార్దన్‌రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్లుడితో ‘గాలి’ ప్రధాన అనుచరుడు ‘డీల్’ మాట్లాడుతున్న నాలుగు వీడియోలు ఇంటర్నెట్‌లో ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. మొత్తం రూ.500 కోట్లకు జరిగిన ఈ డీల్‌కు సంబంధించిన బేరసారాలు జూలై 1, 2010లో అప్పటి మంత్రి అయిన శ్రీరాములు నివాసంలో జరిగినట్టు వీడియోలను బట్టి తెలుస్తోంది. చర్చల్లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి అల్లుడు శ్రీనిజన్‌తోపాటు గనుల డీలర్లు పూబాలన్, కెప్టెన్ రెడ్డితోపాటు ఓ స్వామీజీ కూడా ఉన్నారు.
ఓబుళాపురం మైనింగ్ కేసులో అప్పటి ఏపీ హైకోర్టు గాలి సోదరులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మరికొన్ని రోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కేసుల మాఫీ కోసం చర్చలు జరిగినట్టు బయటపడిన వీడియోల ద్వారా తెలుస్తోంది. మొత్తం రూ.160 కోట్ల డీల్ జరిగినట్టు వీడియోలోని సంభాషణలను బట్టి తెలుస్తోంది. మొత్తం కేసులన్నీ మాఫీ చేస్తే రూ.500 కోట్లు ఇచ్చేందుకు తాము రెడీ అంటూ శ్రీరాములు చెప్పడం స్పష్టంగా వినిపిస్తోంది.
ఎన్నికలకు ఒక్క రోజు ముందు ఈ వీడియోలు బయటపడడంతో కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. కొత్త అస్త్రం దొరకడంతో కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ వీడియోలను విడుదల చేశారు. ఓ కన్నడ టీవీ చానల్ వీటిని పదేపదే ప్రసారం చేసింది. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. అవినీతిపై ప్రధాని మోదీ ద్వంద్వ ప్రవృత్తిని అవలంబిస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రధానికి దమ్ముంటే మొత్తం ‘గాలి’ టీమ్‌ను ఎన్నికల బరి నుంచి ఉపసంహరించాలని సవాలు విసిరారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
అవినీతిపరులకు మోదీ కొమ్ముకాస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. అది గాలి జనార్దన్‌రెడ్డికి సంబంధించిన విషయమని, ఆయనతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు.. బయటపడిన వీడియోలన్నీ నకిలీవని, ఎన్నికలకు ముందు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు కావాలనే వీటిని సృష్టించారని ఆరోపించారు. ఓటమి భయంతో కాంగ్రెస్ ఇటువంటి చవకబారు రాజకీయాలకు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోలపై స్పందించిన ఎన్నికల సంఘం వాటిని ప్రసారం చేయవద్దంటూ అన్ని చానళ్లను ఆదేశించింది.