Arvind Kejriwal: పీడబ్ల్యూడీ కుంభకోణం కేసు .. కేజ్రీవాల్ మేనల్లుడు వినయ్ అరెస్టు
- వినయ్ ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు
- నకిలీ బిల్లులు చూపించి నిధులు పొందిన రేణు కన్ స్ట్రక్షన్స్
- గత ఏడాది మేలో కేసు నమోదు
పీడబ్ల్యూడీ కుంభకోణంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మేనల్లుడు వినయ్ బన్సాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం వినయ్ బన్సాల్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కాగా, కేజ్రీవాల్ బావ సురేందర్ బన్సాల్ కుమారుడే వినయ్ బన్సాల్!
సురేందర్ కు రేణు కన్ స్ట్రక్షన్స్ పేరిట ఓ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో వినయ్ కూడా భాగస్వామి. ఈ కంపెనీతో పాటు మరో రెండు కంపెనీలకు అక్రమంగా కొన్ని కాంట్రాక్టులను కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ (పీడబ్ల్యూడీ మంత్రి) కట్టబెట్టారని ఆరోపిస్తూ రోడ్స్ యాంటీ కరప్షన్ ఆర్గనైజేషన్ (రాకో) వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ అవినీతి నిరోధక శాఖకు గతంలో ఫిర్యాదు చేశారు.
ఈ కంపెనీలు నకిలీ బిల్లులు చూపించి సదరు శాఖ నుంచి నిధులు పొందినట్టు రాహుల్ శర్మ తన ఫిర్యాదులో ఆరోపించారు. గత ఏడాది మేలో ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది. అయితే, కేసు నమోదు చేసిన రోజే సురేందర్ బన్సాల్ అనారోగ్యంతో మృతి చెందారు. సదరు కంపెనీ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా నకిలీ బిల్లులు సమర్పించి నిధులు డ్రా చేసుకున్నట్టు విచారణలో తేలడంతో వినయ్ ను అరెస్టు చేశారు.