Mumbai: యూనిఫాంలోనే భిక్షాటన చేస్తా: ముంబై కాప్
- రెండు నెలలుగా వేతనం అందని ముంబై కానిస్టేబుల్
- యాచకుడిగా మారేందుకు అనుమతి కోరిన వైనం
- అనుమతి కోరుతూ పోలీస్ కమిషనర్, సీఎంకు లేఖ
తనకు గడచిన రెండు నెలలుగా వేతనం ఇవ్వడం లేదని, దీంతో కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయిందని విలపిస్తూ, యూనిఫాం ధరించి భిక్షాటన చేస్తానని, అందుకు అనుమతించాలని ముంబైకి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ పై అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు తనపై అధికారులకు ఓ లేఖ రాసిన కానిస్టేబుల్ దానేశ్వర్ అహిర్రావు, దాని కాపీని ముంబై పోలీస్ కమిషనర్ దత్తా ఫడ్సాల్గికర్, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లకు పంపాడు.
తన ఇంట్లో కనీస అవసరాలను తీర్చలేకపోతున్నానని చెప్పాడు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే నివాసం 'మాతో శ్రీ' ముందు విధులు నిర్వహించే అహిర్రావు, ఈ మేరకు రెండు రోజుల సెలవు కూడా కోరాడు. తన భార్యకు కాలు విరిగిందని, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారని, ఓ కుమార్తె అలనా పాలనా చూసుకోవాల్సి వుందని తన లేఖలో పేర్కొన్నాడు. బ్యాంకు రుణం నెలసరి కిస్తీలు కట్టాల్సివుందని, ఖర్చులకు ఏ మాత్రం డబ్బులేదని చెప్పాడు. ఇక అహిర్రావు లేఖపై డిప్యూటీ కమిషనర్ వసంత్ జాదవ్ ను వివరణ కోరగా, ఇది పాలనా పరమైన వ్యవహారమని, దీనిపై ఇంకన్నా ఎక్కువ మాట్లాడలేనని వ్యాఖ్యానించడం గమనార్హం.