Electric Vehicles: మైనర్లకు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ల లైసెన్స్: కేంద్రమంత్రి గడ్కరీ
- విద్యుత్ వాహనాలకు ఇకపై గ్రీన్ నంబరు ప్లేట్లు
- ట్యాక్సీ సంస్థలు కూడా విద్యుత్ వాహనాలను నడిపించాల్సిందే
- వెల్లడించిన కేంద్రమంత్రి గడ్కరీ
ఎలక్ట్రిక్ స్కూటర్లు నడిపేందుకు అవసరమైన లైసెన్స్‌ను ఇకపై 16-18 ఏళ్ల మధ్య ఉన్న మైనర్లకు కూడా ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్టు కేంద్ర రోడ్లు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. అలాగే, ఎలక్ట్రికల్ వాహనాలకు ఆకుపచ్చ నంబరు ప్లేట్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. వారం రోజుల్లో దీనిపై నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించే ప్రైవేటు వ్యక్తులైతే ఆకుపచ్చ రంగు నంబరు ప్లేటుపై తెలుపు అక్షరాలతో రిజిస్ట్రేషన్ నంబరు రాయాల్సి ఉంటుందని, అదే ట్యాక్సీలైతే పసుపు రంగు అక్షరాలతో రాయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే, ట్యాక్సీ సేవలు అందిస్తున్న సంస్థలు తప్పనిసరిగా కొన్ని విద్యుత్ వాహనాలను కలిగి ఉండాలన్న నిబంధనను తీసుకురావాలని యోచిస్తున్నట్టు మంత్రి చెప్పారు.