Andhra Pradesh: మనుసుపెడితే అద్భుతాలు చేయవచ్చు!: సీఎం చంద్రబాబు
- అమరావతిలో సీఎం అధ్యక్షతన రెండోరోజు కలెక్టర్ల సదస్సు
- నూతన ఆలోచనల సృష్టికి ఈ సమావేశం దోహదపడుతుంది
- రాష్ట్రం సాధించిన ఫలితాలలో ప్రతిఒక్కరికీ భాగస్వామ్యం ఉంది
- భారతదేశంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టీమ్ మనదే
నిరంతర శ్రమతో విజయం సాధించవచ్చని, మనసుపెడితే అద్భుతాలు చేయవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో సీఎం అధ్యక్షతన రెండోరోజు కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, నూతన ఆలోచనల సృష్టికి కలెక్టర్ల సమావేశం దోహదం చేస్తుందని, సంక్షోభ సమయంలోనూ కలిసికట్టుగా పని చేసి అభివృద్ధి సాధించామని అన్నారు.
రాష్ట్రం సాధించిన ఫలితాలలో ప్రతిఒక్కరికీ భాగస్వామ్యం ఉందని, భారతదేశంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టీమ్ మనదేనని ప్రశంసించారు. టీమ్ సమర్ధవంతంగా పనిచేస్తే ఏదైనా సాధించగలమని, లీడర్ గా నూరు శాతం ఫలితాలు సాధించాలంటే మన దగ్గర పని చేసే టీమ్ చాలా ముఖ్యమని చెప్పారు. మనం చేపడుతున్న కార్యక్రమాలను, ధనిక రాష్ట్రాలు కూడా అమలు చేయలేకపోయాయని అన్నారు. ‘2029 కంటే ముందే దేశంలో ఏపీ నెంబర్ వన్ అవుతుంది. మిమ్మల్ని చూశాక ఆ నమ్మకం రెట్టింపయింది' అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
భారత్ లో ఇన్నోవేషన్ వ్యాలీ అంటే ఏపీనే గుర్తుకురావాలి
ప్రపంచంలోని ఇన్నేవేటర్స్ ఏపీకి వచ్చేలా చూడాలని, వాళ్ల ఆవిష్కరణలకు మన రాష్ట్రం వేదిక కావాలని చంద్రబాబు అన్నారు. భారత్ లో ఇన్నోవేషన్ వ్యాలీ అంటే ఏపీనే గుర్తుకురావాలని, ప్రతీ శాఖ వినూత్న ఆవిష్కరణలపై ఎక్కువగా దృష్టిపెట్టాలని సూచించారు. నూతన ఆవిష్కరణల్లో పంచాయతీరాజ్ శాఖ ముందుందని చెప్పారు. ‘అవినీతిని ఉపేక్షించవద్దు .. అవినీతిపై ఉక్కుపాదం మోపండి’ అని కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు.