ramdev baba: ముస్లింలు ఫొటోలు, విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వనప్పుడు జిన్నాపై జగడం ఎందుకు?: రామ్ దేవ్ బాబా
- దీనిపై ముస్లింలు ఆందోళన చెందడం అనవసరం
- జిన్నా పాకిస్తాన్ కు మంచివాడేమో
- ఐక్యత కోరుకునే భారతీయులకు కాదు
యోగా గురు, పతంజలి సంస్థ అధినేత బాబా రాందేవ్ మొహమ్మద్ అలీజిన్నా పోస్టర్ వివాదంలో తలదూర్చేశారు. యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో పాక్ వ్యవస్థాపకుడి ఫొటోలు దర్శనమివ్వడంపై ఇటీవల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. స్థానికంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణకు సైతం దారితీసింది.
దీనిపై రాందేవ్ స్పందిస్తూ ముస్లింలు ఫొటోలు, విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వనప్పుడు జిన్నా చిత్రాలపై ఆందోళన చెందనక్కర్లేదన్నారు. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు ఆ దేశానికి మంచివాడే కానీ, ఐక్యత, సమగ్రత కోరుకునే భారతీయులకు మాత్రం మార్గదర్శకుడు కాదని రాందేవ్ అభిప్రాయపడ్డారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ కార్యాలయంలో జిన్నా పోట్రయిట్ లు ఉంచడాన్ని బీజేపీ అలీగడ్ ఎంపీ సతీష్ గౌతం ప్రశ్నించడంతో ఈ వివాదం మొదలైన విషయం విదితమే.