Vasantha krishna prasad: రేపు వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు కృష్ణప్రసాద్

  • రేపు ఐతవరం నుంచి కైకలూరుకు భారీ ర్యాలీ
  • జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్న కృష్ణ ప్రసాద్
  • ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్

మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన వసంత కృష్ణ ప్రసాద్ రేపు (గురువారం) వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. రేపు ఉదయం నందిగామ మండలం ఐతవరంలోని ఆయన ఇంటి నుంచి మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి కైకలూరులో జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు కృష్ణ ప్రసాద్ తెలిపారు.

టీడీపీలో తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదని గత కొంతకాలంగా కినుక వహించిన కృష్ణప్రసాద్ చివరికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 1999లో నందిగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఓటమి పాలయ్యారు. 2014లో టీడీపీలో చేరిన ఆయన గుంటూరు-2 స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో టికెట్ లభించలేదు. దీంతో ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు గెలుపునకు కృషి చేశారు. ఆయన మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కృష్ణప్రసాద్‌ను దూరంగా ఉంచడంతో ఆయన మనస్తాపం చెందారు.

ఈ నేపథ్యంలో గతంలో ఒకటి రెండుసార్లు వైసీపీ చీఫ్ జగన్ నుంచి కృష్ణ ప్రసాద్‌కు ఆహ్వానం అందింది. దీంతో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న కృష్ణ ప్రసాద్ అందుకు ఈనెల 10న ముహూర్తంగా నిర్ణయించారు. ఇక పార్టీలో చేరకముందే ఆయనకు టికెట్ ఖరారైందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మైలవరం అసెంబ్లీ, లేదంటే విజయవాడ నుంచి ఆయనను లోక్‌సభ బరిలో దింపాలని వైసీపీ యోచిస్తున్నట్టు సమాచారం.

Vasantha krishna prasad
Andhra Pradesh
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News