Revanth Reddy: మోదీ ఆదేశాలు ఇచ్చారు.. కేసీఆర్‌ సమీక్ష చేశారు!: 'ఓటుకు నోటు' కేసుపై రేవంత్‌ రెడ్డి

  • నిన్న కేసీఆర్‌ భేటీపై రేవంత్‌ రెడ్డి ఫైర్‌
  • మోదీ, కేసీఆర్‌ కలిసి నాటకం ఆడుతున్నారు
  • అందులో భాగమే నిన్నటి వ్యవహారం
  • ఓటుకు నోటు కేసు వివరాలు నేను చెప్పకూడదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో ఓటుకు నోటు కేసుపై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే జైలుకి వెళ్లివచ్చిన కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమని భయపెట్టో, బెదిరించో లొంగదీసుకుని రాజకీయ పరంగా కొందరు ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిసి ఆడుతోన్న నాటకంలో భాగమే నిన్నటి వ్యవహారమని అన్నారు.

ఈ సందర్భంగా ఓటుకు నోటు కేసుకి సంబంధించి వివరాలు చెప్పాలని తాను అనుకోవట్లేదని, ఈ విషయంపై మాట్లాడవద్దని కోర్టు ఆంక్షలు విధించిందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. కేసీఆర్ తీరుని మాత్రం ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం నిన్న పలువురు అధికారులతో కేసీఆర్ ఏడు గంటలు ఓటుకు నోటు కేసుపై చర్చించారని అన్నారు.

ఇటీవల భారత రాజకీయ అంశాలను గమనిస్తే ప్రధానంగా ఏపీకి ప్రధాని మోదీ అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారని రేవంత్‌ రెడ్డి అన్నారు. అదే సమయంలో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై తాము పోరాడుతున్నామని, తాను కాంగ్రెస్‌ సభల్లో పాల్గొంటూ కేసీఆర్‌ సర్కారు ఎన్ని కోట్ల రూపాయల అనినీతికి పాల్పడిందో వివరిస్తున్నానని తెలిపారు.

రాష్ట్ర ప్రజల్లో ఆలోచన కలుగజేస్తూ చైతన్యం తీసుకొస్తున్నానని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ కుటుంబం విలాసవంతమైన జీవితం కొనసాగించడానికి ఎటువంటి చర్యలకు పాల్పడుతుందో వివరించి చెబుతున్నానని అన్నారు. దీంతో మోదీ, కేసీఆర్ ఈ విషయాలను జీర్ణించుకోలేకపోతున్నారని, మోదీ ఆదేశాల మేరకు కేసీఆర్‌ నిన్న సమీక్ష జరిపారని అన్నారు.  

  • Loading...

More Telugu News