railway: టికెట్ల బుకింగ్ విషయంలో రైల్వే శాఖ యోచన.. ఆధార్ తప్పనిసరి
- రైల్వే టికెట్ల రాకెట్లను అరికట్టడానికి కొత్త విధానం
- సీఆర్‌ఐఎస్, ఐఆర్‌సీటీసీ సాంకేతిక నిపుణుల నుంచి సిఫార్సు
- యూజర్ ఐడీలు వారి ఆధార్ కార్డులతో అనుసంధానం
అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి అవుతోంది. ఇకపై రైలు టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్నా ఆధార్ నెంబర్ ను తప్పనిసరి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. రైల్వే టికెట్ల రాకెట్లను అరికట్టడానికి ఈ విధానాన్ని అవలంబించాలని ఇటీవల రైల్వేశాఖకు సీఆర్‌ఐఎస్, ఐఆర్‌సీటీసీ సాంకేతిక నిపుణుల నుంచి సిఫార్సు వచ్చింది. దీనిపై యోచించిన రైల్వేశాఖ టికెట్ బుకింగ్‌కు ఆధార్‌కార్డును తప్పనిసరి చేయాలని అనుకుంటోంది.
ఇటీవల ముంబయిలో రైల్వే టికెట్ల రాకెట్ గుట్టు బయటపడడంతో ఓ వ్యక్తిని అరెస్టు చేసి, సుమారు రూ.1.5 కోట్ల విలువ గల ఈ-రైల్వే టికెట్లను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఇటువంటి మోసాలు జరగకుండా యూజర్ ఐడీలను వారి ఆధార్ కార్డులతో అనుసంధానం చేయించాలని సంబంధిత అధికారులు భావిస్తున్నారు.