Chandrababu: ఇంకా నష్టపోకూడదనే ప్రశ్నిస్తున్నాం: చంద్రబాబు

  • విభజన నష్టాలను పూడ్చుకోవడానికే ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నాం
  • ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే ఎన్డీయే నుంచి బయటకు వచ్చాం
  • కష్టాల్లో సైతం ప్రజలకు మంచి పాలన అందిస్తున్నాం

రాష్ట్ర విభజనతో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని... విభజనతో ఏర్పడిన నష్టాలను పూడ్చుకోవడానికే ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించలేదని చెప్పారు. ఎన్నో కష్టాలతోనే ఏపీలో పరిపాలనను ప్రారంభించామని... ఇచ్చిన హామీలను కేంద్ర నెరవేర్చక పోవడంవల్లే ఎన్డీయే నుంచి వైదొలగామని తెలిపారు. మన హక్కుల కోసం ఓ వైపు పోరాడుతూనే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. మనపై ఇప్పుడు మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్సులో మాట్లాడుతూ, చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఏపీకి న్యాయం చేస్తుందనే నమ్మకంతో చాలా కాలం వేచి చూశామని... ఇప్పుడు కూడా గట్టిగా అడగకపోతే నష్టపోతామనే భావనతోనే కేంద్రాన్ని నిలదీస్తున్నామని చంద్రబాబు చెప్పారు. కష్టాల్లో సైతం ప్రజలకు ఇబ్బందులు లేని పరిపాలనను అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలకు సంబంధించి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నామని... ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగిందని చెప్పారు. 

  • Loading...

More Telugu News