Chandrababu: ఏక పక్షంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు: పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, ఏపీ మంత్రి యనమల
- కేంద్ర సర్కారు ఏకపక్ష ధోరణిపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి
- సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది
- ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడుతోంది
- రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
కేంద్ర సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రాలను సంప్రదించవలసిన అవసరం ఉందని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఏ రకంగా సమాఖ్య స్ఫూర్తి అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. అమరావతిలోని ఏపీ సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో ఈ రోజు ఉదయం జరిగిన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర సర్కారు ఏకపక్ష ధోరణిపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడుతోందని, రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం రూపొందించిన విధి విధానాల వల్ల రాష్ట్రాలు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోల్పోతున్నాయన్నారు. యుద్ధ సమయంలో ఇలాంటి విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుందని, కేంద్ర సర్కారు ఇందుకు విరుద్ధంగా సాధారణ పరిస్థితుల్లోనూ సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలనే విషయాన్ని గతంలో సర్కారియా కమిషన్ స్పష్టంగా పేర్కొందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల వల్ల సమాఖ్య సమతుల్యత దెబ్బతింటుందన్నారు.
గత నెల 10న కేరళలో జరిగిన సమావేశంలో నాలుగు రాష్ట్రాల మద్దతే లభించిందని, ఈ సమావేశానికి మద్దతిచ్చే రాష్ట్రాల సంఖ్య పెరిగిందని కేరళ ఆర్థిక మంత్రి డాక్టర్ టీఎం థామస్ ఇసాక్ చెప్పారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలను వ్యతిరేకించే రాష్ట్రాల సంఖ్య భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు కేటాయిస్తామంటే జనాభా నియంత్రణను అమలు చేసిన రాష్ట్రాలు నష్టపోతాయన్నారు.
ఏపీని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి డాక్టర్ అమిత్ మిత్ర కొనియాడారు. గ్రీన్ ఫీల్డ్ రాజధాని ఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు ఛాలెంజ్ గా తీసుకున్నారన్నారు. ఐటీ రంగంలో చంద్రబాబు ఎటువంటి కృషి చేశారో అందరికీ తెలుసని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం ద్వారానే కాకుండా వివిధ రూపాల్లో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు.
గతంలో ఏ కేంద్ర సర్కారూ వ్యవహరించని విధంగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ప్రజాకర్ష పథకాలకు నిధుల కోత పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందని, 15వ ఆర్థిక సంఘం విధి విధానాల విషయంలో కేంద్రం వ్యవహరిస్తోన్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు రాష్ట్రపతి దగ్గరకు వెళ్లాల్సి ఉందని ఆయన అన్నారు.
చిన్న రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 15వ ఆర్థిక సంఘం విధి విధానాలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. కేరళలో జరిగిన ఆర్థిక మంత్రుల సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. పంజాబ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి కేవలం 29 శాతం నిధులు మాత్రమే వస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలకు కేంద్ర వాటా ఎక్కువగా వెళుతోందని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని పంజాబ్ ఆర్థిక మంత్రి మన్ ప్రీత్ సింగ్ అన్నారు.