bankers: మరోసారి సమ్మెకు దిగనున్న బ్యాంకు ఉద్యోగులు?
- వేతనాల పెంపు విషయమై జరిగిన చర్చలు విఫలం
- మా నిజమైన డిమాండ్లను నెరవేర్చాలి
- లేనిపక్షంలో ఈ నెలఖారులో రెండు రోజులు సమ్మెకు దిగుతాం
- హెచ్చరించిన బ్యాంకు ఉద్యోగులు
వేతనాల పెంపు విషయమై కేంద్ర ఆర్థిక శాఖపై అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎఐబీఈఏ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఒత్తిడి తేవడంలో విఫలమయ్యాయని బ్యాంకు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మెకు దిగనున్నారు. బ్యాంకు ఉద్యోగుల నిజమైన డిమాండ్లను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
బ్యాంకు ఉద్యోగుల వేతనాలను 2 శాతం పెంచేందుకు మాత్రమే ఐబీఏ ముందుకొచ్చిందని, గతంలో జరిగిన 15 శాతం పెంపు ఒప్పందానికి ఇది విరుద్ధమని ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ డిమాండ్లపై స్పందించకపోతే ఈ నెలాఖరులో రెండు రోజులు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
కాగా, వేతనాల పెంపు విషయమై యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్లు (యూఎఫ్ బీయూ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐఓబీ)కు మధ్య నిన్న జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన పది లక్షల మందికి పైగా ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.
ఐబీఏ ఆఫర్ చేసే మొత్తం చాలా తక్కువగా ఉంది
2012 నవంబర్ 1న పదవ బిపర్ టైట్ వేతన ఒప్పందం జరిగిందని, ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం వేతన బిల్లులో పదిహేను శాతానికి పైగా పెంపుదలను ఐబీఏ ఆఫర్ చేయనున్నట్టు తెలిపిందని అఖిల భారత బ్యాంకు ఎంప్లాయూస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు.
అయితే, ఈ పెంపును రెండు శాతం మాత్రమే చేపట్టనున్నట్టు గత ఏడాది మార్చి 3న ఐబీఏ ప్రకటించిందని, ఈ పెంపు చాలా తక్కువగా ఉందని అన్నారు. ఈ విషయమై ఆర్థిక మంత్రిత్వ శాఖ తక్షణం జోక్యం చేసుకోవాలని, ఈ విషయంలో మంత్రిత్వ శాఖ కూడా విఫలమైతే నలభై ఎనిమిది గంటల పాటు సమ్మెకు దిగక తప్పదని హెచ్చరించారు.