manmohan singh: మోదీ సర్కారు రెండు ఘోర తప్పిదాలు చేసింది: మన్మోహన్ సింగ్
- పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తొందరపాటుగా అమలు చేయడం
- వీటి వల్ల వేలాది ఉద్యోగాలకు నష్టం
- ఆర్థిక నిర్వహణ ఘోరం
- బ్యాంకింగ్ పై ప్రజల్లో తగ్గుతున్న నమ్మకం
నరేంద్రమోదీ సర్కారు రెండు ఘోర తప్పిదాలు చేసిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శించారు. అందులో ఒకటి పెద్ద నోట్ల రద్దు చర్యను పేర్కొన్నారు. రెండో తప్పుగా జీఎస్టీని తొందరపాటుగా అమలు చేయడమని తెలిపారు. ఈ రెండు తప్పుల ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు ఎంతో నష్టం వాటిల్లిందని ప్రముఖ ఆర్థిక వేత్త కూడా అయిన మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
ఈ చర్యలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలపై ప్రభావం పడి, వేలాది ఉద్యోగాలు పోయినట్టు చెప్పారు. మోదీ సర్కారు ఆర్థిక నిర్వహణ తీరు కారణంగా ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం క్రమంగా తుడిచిపెట్టుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో నెలకొన్న నగదు కొరత సమస్య నివారించతగినదేనని చెప్పారు.