Karnataka: నేడంతా రాహుల్, అమిత్ షా ఫుల్ బిజీ... వచ్చి చేరనున్న యోగి ఆదిత్యనాధ్

  • మరో నాలుగు రోజుల్లో కర్ణాటక ఎన్నికలు
  • జోరుగా సాగుతున్న నేతల ప్రచారం
  • బెంగళూరు చేరిన మన్మోహన్ సింగ్, యోగి ఆదిత్యనాథ్
  • రేపు సోనియా గాంధీ రాక

మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోనే ఉంచాలని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, దాదాపు రెండు నెలలుగా విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, గతంలో కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందాలని బీజేపీ, కింగ్ మేకర్ గా మారాలన్న ఆలోచనలో ఉన్న జేడీ (యస్)లు అలుపెరగక ప్రచారం సాగిస్తున్నాయి. నేడు ప్రధాన పార్టీల నేతలంతా ఫుల్ బిజీగా గడపనున్నారు.

మాలూరు, వనకోట, దేవనహళ్లి, దొడ్డబల్లాపూర్ ప్రాంతాల్లో రాహుల్ ప్రచారాన్ని నిర్వహించనుండగా, నారగుండు, హరపనహళ్లి, యశ్వంత్ పురా, నేలమంగళ తదితర ప్రాంతాల్లో అమిత్ షా రోడ్ షో నిర్వహించి, బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. నేడు బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చి చేరనుండటం ప్రత్యేక ఆకర్షణ. బల్కి, ఉమ్నాబాద్, బల్గేవి, గోకక్ తదితర ప్రాంతాల్లో యూపీ సీఎం బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

బీజేపీ ప్రచారంలో అన్నీ తానై ప్రచార బాధ్యతలను అమిత్ షా భుజాన వేసుకోగా, ప్రధాని నరేంద్ర మోదీ, ఇప్పటికే పలుమార్లు రాష్ట్రానికి వచ్చి రోడ్ షోలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అగ్రనేతలంతా కనీసం ఒకసారైనా కర్ణాటకకు వచ్చి ప్రచారం చేసి వెళుతుండటంతో, కాంగ్రెస్ కూడా అదే దారిలో నడవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గత రాత్రి బెంగళూరు చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, నేడు బెంగళూరులో ప్రచారం సాగించడంతో పాటు మీడియాతోనూ ఎన్నికలపై మాట్లాడనున్నారు. ఇక ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీ రేపటి నుంచి కర్ణాటక ప్రచారంలో పాల్గొనేందుకు రంగం సిద్ధమైంది.

  • Loading...

More Telugu News