Republic Day: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ఐఆర్!
- అర్నాబ్ తనకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదంటూ ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య
- సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య అక్షత
- అర్నాబ్ తో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై ముంబైలోని అలీబాగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అర్నాబ్ గోస్వామి తనకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో కలత చెందిన ఇంటీరియర్ డిజైనర్ అన్వాయ్ నాయక్ నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలీభాగ్ లోని తన నివాసంలో అన్వాయ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అన్వాయ్ వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆయన భార్య అక్షత పోలీసులకు ఫిర్యాదు చేేశారు.
ఈ విషయమై ఏఎస్పీ సంజయ్ పాటిల్ మాట్లాడుతూ, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలతో అర్నాబ్ గోస్వామితో పాటు ఫిరోజ్ షేక్, నితీష్ సార్థాలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. రిపబ్లిక్ టీవీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు రాకపోవడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అక్షత ఆ ఫిర్యాదులో ఆరోపించినట్టు చెప్పారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు చేపడతామని, ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. కాగా, ఈ ఆరోపణలను రిపబ్లిక్ టీవీ ప్రతినిధులు ఖండించారు. అతనికి చెల్లించాల్సిన బకాయిలను వాయిదా పద్ధతిలో మొత్తం చెల్లించామని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు.