ips rupa: ఐపీఎస్ అధికారిణి రూప ట్వీట్ పై నెటిజన్ల విమర్శలు
- బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామితో కలిసి సెల్ఫీ దిగిన రూప
- సార్, మీరు (సుబ్రహ్మణ్యస్వామి) చాలా గొప్ప వ్యక్తి
- మీరే కనుక ఫిర్యాదు చేయకుంటే శశికళ జైలుకెళ్లే వారు కాదేమో!
- మీ స్ఫూర్తితోనే ఆమె జైల్లో చేసిన అక్రమాలు నేను బయటపెట్టా
బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామితో కలిసి కర్ణాటకకు చెందిన ఐపీఎస్ అధికారిణి రూప ఓ సెల్ఫీ దిగి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సుబ్రహ్మణ్యస్వామిని ఉద్దేశించి, ‘సార్, మీరు చాలా గొప్ప వ్యక్తి .. స్ఫూర్తి దాయకం. మీరే కనుక ఫిర్యాదు చేయకుంటే ఆ వ్యక్తి (శశికళ) అసలు జైలుకు వెళ్లే వారు కాదేమో! మీ స్ఫూర్తితోనే ఆమె జైల్లో చేసిన అక్రమాలు నేను బయటపెట్టా’ అని రూప అన్నారు.
ఈ ట్వీట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘మీరు (రూప) బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు’ అని ఓ నెటిజన్ విమర్శించారు. ఇందుకు తిరిగి ప్రతిస్పందించిన రూప, పరప్పణ అగ్రహార జైల్లో తాను జైలు నివేదిక అందజేయగానే తనను బదిలీ చేశారని, నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక పోలీస్ శాఖ ప్రవర్తించిందని, అప్పుడెవరూ ప్రశ్నించలేదని, ఓ గొప్ప వ్యక్తితో కలిసి సెల్ఫీ దిగితే రాజకీయాలు చేయడం సబబు కాదని మండిపడ్డారు.