Pakistan: బీహార్ నిర్వాకం... పాక్ జెండా గీస్తున్న బాలిక ఫొటోతో ప్రచారం... విచారణకు ఆదేశం!

  • నోట్ పుస్తకాలపై పాకిస్థాన్ బాలిక
  • పాక్ జెండా గీస్తుండగా తీసిన చిత్రం
  • గతంలో పాక్ లో యునిసెఫ్ వాడిన చిత్రం
  • ముందూ వెనుకా చూడకుండా వాడేసిన బీహార్ అధికారులు

బీహార్ అధికారులు చేసిన పని తీవ్ర విమర్శలకు తావివ్వగా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విచారణకు ఆదేశించారు. జాముయ్ జిల్లాలో పరిశుభ్రతా ప్రచారానికి ఓ పాకిస్థాన్ బాలికను వాడుకోవడమే అధికారులు చేసిన నిర్వాకం. తన దేశపు జెండా గీస్తున్న ఓ బాలిక చిత్రాన్ని 'స్వచ్ఛ జాముయ్, స్వచ్ఛతా జాముయ్' పోస్టర్లలో అధికారులు ముద్రించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ కుర్చీపై కూర్చున్న ఐదేళ్ల బాలిక పాకిస్థాన్ జెండాను గీస్తుండగా, ఆ ఫొటోను ప్రమోషన్ కోసం అధికారులు వాడారు. ఆమె చిత్రాన్ని నోట్ బుక్స్ పై ప్రింట్ చేశారు. పాట్నా లోని సుప్రభ్ ఎంటర్ ప్రైజెస్ ప్రింటింగ్ ప్రెస్ నోట్ బుక్స్ ను ముద్రించగా, వాటిని విద్యార్థులకు పంచారు.

ఇక ఆ పాప చిత్రాన్ని గతంలో పాకిస్థాన్ లో బాలికా విద్య ప్రమోషన్ నిమిత్తం యునిసెఫ్ వాడిందని తెలుస్తుండగా, అదే చిత్రాన్ని ఇంటర్ నెట్ నుంచి తీసుకుని ముందూ వెనుకా చూడకుండా నోట్ బుక్స్ పై వాడినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం విచారణ సాగుతుండగా, అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికారులు కావాలనే ఇలా చేశారని విపక్షాలు, ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం తగదని అధికార పక్ష నేతలు వ్యాఖ్యానించారు. కాగా, తాము అధికారులకు ప్రూఫ్ పంపిన తరువాతనే నోట్ పుస్తకాలు ముద్రించామని సుప్రభ్ ఎంటర్ ప్రైజస్ వాదిస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News