Guntur District: నాలుగు రోజుల తరువాత చల్లబడిన దాచేపల్లి... మకాం వేసి చక్కదిద్దిన ఎస్పీ!

  • 9 సంవత్సరాల బాలికపై వృద్ధుడి అత్యాచారం
  • అట్టుడికిన గుంటూరు జిల్లా దాచేపల్లి
  • రెండు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తత
  • మూడో రోజు నిందితుడి ఆత్మహత్య

9 సంవత్సరాల బాలికపై ఓ వృద్ధుడి అత్యాచారంతో అట్టుడికిన దాచేపల్లి, నిందితుడి ఆత్మహత్య తరువాత చల్లబడింది. నాలుగు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన తరువాత అధికారులు, పోలీసు యంత్రాంగం దాచేపల్లిలో మకాంవేసి పరిస్థితిని చక్కదిద్దారు. బాలికపై అత్యాచారం జరిగిందన్న వార్త బయటకు వచ్చిన తరువాత గ్రామస్తులు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి తమ నిరసన తెలియజేయగా, దాదాపు రెండు రోజుల పాటు గ్రామం అట్టుడికింది.

అద్దంకి - నార్కట్ పల్లి రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. గత బుధవారం రాత్రి 9 గంటల సమయంలో అత్యాచారం విషయం బయటకు రాగా, అదే రోజు రాత్రి నుంచి నిరసన ప్రారంభమైంది. తెల్లారేసరికి రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. బాధితురాలికి అండగా ఉన్నామని భరోసా ఇస్తూ, అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు గుప్పించాయి. నిందితుడు మీ పార్టీ వాడంటే, మీ పార్టీ వాడంటూ టీడీపీ, వైసీపీలు విమర్శలు చేసుకున్నాయి. ఆపై గురు, శుక్రవారాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది.

ఇక దాచేపల్లిలో శాంతిభద్రతల సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని తెలుసుకున్న జిల్లా రూరల్ ఎస్పీ అప్పలనాయుడు మూడు రోజుల పాటు అక్కడే మకాం వేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. రెండు వారాల్లో నిందితుడిని అరెస్ట్ చేస్తామని, ఉరిశిక్ష పడేలా చూస్తామని, అదే జరగకుంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని కూడా ఆయన నిరసనకారులకు హామీ ఇవ్వడం గమనార్హం. ప్రజలను శాంతింపజేయడంలో ఆయన పాత్ర ఎంతైనా ఉంది.

ఇక నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తెలిసిన తరువాత, అంత్యక్రియలు పూర్తయ్యేవరకూ అప్పలనాయుడు అక్కడే ఉండి, పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దాచేపల్లి చల్లబడింది. అయినా, ముందు జాగ్రత్త చర్యగా, పాతబస్టాండ్‌ సెంటర్, లైబ్రరీ సెంటర్, నడికుడి మార్కెట్‌ యార్డు తదితర ప్రాంతాల వద్ద పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది.

Guntur District
Dachepalli
Rape
Rural SP
Protest
  • Loading...

More Telugu News