tirumala: తిరుమలను లాగేసుకోవడానికి కేంద్రం వ్యూహం.. ఇది పూర్తయితే ఏపీ ప్రభుత్వం డమ్మీ!
- రక్షిత కట్టడాల జాబితాలోకి టీటీడీ ఆలయాలను తీసుకొచ్చే పనిలో కేంద్రం
- ఇదే జరిగితే కేంద్రం పరిధిలోకి తిరుమల
- టీటీడీపై అధికారానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దూరమవుతుంది
దక్షిణాది రాష్ట్రాల ఇలవేలుపు తిరుమల వెంకన్నపై కేంద్ర ప్రభుత్వం కన్నేయడం కలకలం రేపుతోంది. టీటీడీ పరిధిలో ఉన్న అన్ని ఆలయాలను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. రక్షిత కట్టడాల పరిధిలోకి టీటీడీ ఆలయాలను తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ ఇప్పటికే సన్నాహకాలు మొదలుపెట్టింది. ఒకవేళ రక్షిత కట్టడాల జాబితాలోకి టీటీడీ ఆలయాలు వెళితే.... మొత్తం టీటీడీ కేంద్రం చేతుల్లోకి వెళుతుంది.
ఆలయాలను సందర్శించి ఫొటోలు తీసుకునేందుకు సహకరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇప్పటికే లేఖ రాసింది. కేంద్ర పురావస్తు డైరెక్టరేట్ నుంచి విజయవాడలోని అమరావతికి సర్కిల్ కు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో టీటీడీకి పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ లేఖ రాసింది.
తిరుమలలో పురాతన కట్టడాలను తొలగించి, కొత్త నిర్మాణాలను చేపడుతున్నారని... పురాతన కట్టడాలకు రక్షణ కరువైందని తమకు పలు ఫిర్యాదులు అందినట్టు కేంద్ర పురావస్తు శాఖ చెబుతోంది. భక్తులు ఇచ్చిన కానుకలను సరిగా భద్రపరచడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయట. ఈ నేపథ్యంలో, వెంకన్నకు గతంలో రాజులు ఇచ్చిన ఆభరణాలకు కూడా భద్రత లేదని పురావస్తు శాఖ చెబుతోంది.
ఈ నేపథ్యంలో, త్వరలోనే తిరుమలను పురావస్తు శాఖ అధికారులు సందర్శించనున్నారు. తమ నివేదికను సమర్పించిన తర్వాత... కేంద్ర అధికారులు తిరుమలను సందర్శిస్తారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియ అంతా అనుకున్నట్టే జరిగితే... టీటీడీ మొత్తం కేంద్రం పరిధిలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత టీటీడీపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. సంపాదన మొత్తం కేంద్ర ఖజానాకు వెళుతుంది. చివరకు టీటీడీ బోర్డు మెంబర్లను నియమించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. చివరకు ఏం జరగనుందో... వేచి చూడాలి.