Chandrababu: ఆ అమ్మాయి పైకొచ్చే వరకూ బాధ్యత నాదే : సీఎం చంద్రబాబు
- అత్యాచార బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు
- నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ అమ్మాయిని చదివిస్తా
- నేను గార్డియన్ గా ఉంటా
- ఆ అమ్మాయి ఆశయం నెరవేరే వరకు అండగా ఉంటా
దాచేపల్లి ఘటనలో బాధితురాలి సంరక్షణ బాధ్యతలను పూర్తిగా తాను తీసుకుంటున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని ఈరోజు ఆయన పరామర్శించారు. అనంతరం, చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ‘నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ అమ్మాయి పైకొచ్చే వరకు, జీవితంలో ఉన్నతమైన స్థానానికి వచ్చే వరకు చదివించే బాధ్యత, పూర్తిగా సంరక్షించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ అమ్మాయిని చేర్పించేందుకు మంచి స్కూల్ చూడమని కలెక్టర్ కు కూడా చెప్పాను. మేనేజ్ మెంట్ తో మాట్లాడి ఆ స్కూల్ లో అడ్మిట్ చేస్తాం. భవిష్యత్తులో ప్రతి సంవత్సరం ఆ అమ్మాయికి అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తా. ఆ అమ్మాయి తల్లిదండ్రులు పేరెంట్స్ గా ఉంటారు.. నేను మాత్రం గార్డియన్ గా ఉండి ఆ అమ్మాయిని పూర్తిగా సంరక్షిస్తా. ఆ అమ్మాయి ఆశయం నెరవేరే వరకు నేను అన్నివిధాలా సహకరిస్తా’ అని చెప్పారు.
బాధితురాలి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం
దాచేపల్లి అత్యాచార ఘటనలో బాధితురాలి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని చంద్రబాబు అన్నారు. ‘ఇప్పటికే రూ.5 లక్షలు ఇచ్చాం.ఇంకో రూ. 5 లక్షలు ఆ అమ్మాయి పేరుతో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తాం. బాధితురాలి తండ్రి వ్యవసాయం చేసుకునేందుకు రెండు ఎకరాల భూమి కొనిస్తాం. బాధితురాలికి తండ్రికి ఏదైనా ఉపాధి కావాలంటే అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం, ఇల్లు కూడా ఇప్పిస్తాం’ అని అన్నారు.