amul: ‘అమూల్’, ‘మదర్ డైరీ’లు నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదట !

  • ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడి
  • ఢిల్లీ వ్యాప్తంగా 165 డైరీల్లోని పాల నమూనాలకు పరీక్షలు
  • అందులో.. నాసిరకంగా ఇరవై ఒక్క డైరీల పాలు 

దేశంలోని ప్రతి రాష్ట్రంలో సహకార పాల ఉత్పత్తి కేంద్రాలు, ప్రైవేటు డైరీలు ఉన్నాయి. పాలు, పాల ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తుంటారు. అయితే, నాణ్యతా ప్రమాణాలు పాటించే విషయంలో మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయట. ఈ విషయం ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. గుజరాత్ సహకార డైరీ అమూల్, నోయిడాలోని మదర్ డైరీ వంటి పెద్ద సంస్థలు కూడా నాణ్యతా ప్రమాణాలను పాటించడంలేదని తేలినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘అమూల్’, ‘మదర్ డైరీ’ సహా ఇరవై ఒక్క డైరీలకు చెందిన పాల నమూనాలు నాసిరకంగా ఉన్నాయని మంత్రి అన్నారు. ఆరోగ్యానికి ప్రమాదకరం కాకపోయినప్పటికీ, నాణ్యతా ప్రమాణాలను ఆయా డైరీలు పాటించడంలేదని సత్యేందర్ జైన్ చెప్పారు. గత నెల 13 నుంచి 28 వరకు ఢిల్లీ వ్యాప్తంగా పలు డైరీలకు చెందిన 165 పాల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపామని చెప్పారు. ఇందులో, ఇరవై ఒక్క డైరీలకు చెందిన పాల నమూనాలు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదని, ఈ నమూనాల నివేదికను కోర్టుకు అందజేస్తామని అన్నారు.

నిబంధనలు పాటించని డైరీలకు జరిమానా తప్పదు

నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చే డైరీలకు జరిమానా విధించనున్నట్టు సత్యేందర్ జైన్ హెచ్చరించారు. నిబంధనలు పాటించని డైరీలకు రూ. 5 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News