Andhra Pradesh: ఇలాంటి నేరాలను అరికట్టాలంటే చట్టాలు ఇంకా పదునుగా ఉండాలి : ఏపీ స్పీకర్ కోడెల
- బాధిత బాలికను పరామర్శించిన కోడెల
- ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా
- వెురుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు ఆదేశాలు
గుంటూరు జిల్లా దాచేపల్లిలో అత్యాచారానికి గురైన బాలికను ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఈరోజు పరామర్శించారు. గుంటూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, దాచేపల్లి ఘటనలో ప్రభుత్వం తక్షణమే స్పందించిందని అన్నారు. అత్యాచార నిరోధక చట్టాల అమలు ఇంకా పదునుగా ఉండాలని, అందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని, నిందితుడికి ఎలాంటి శిక్ష పడాలని సమాజం కోరుకుందో అదే జరిగిందని అన్నారు. ఈ ఘటనలో చిన్నారి బాధితురాలే కానీ, బాధ్యురాలు కాదని .. ప్రస్తుతం ఆమెకు కావాల్సింది సానుభూతి కాదని, మనోధైర్యం అని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.