railway: రైల్వే శాఖ కొత్త నిర్ణయం.. ఇకపై మహిళా ప్రయాణికులకు మరింత భద్రత!
- ఇకపై రైలు మధ్య భాగంలో మహిళా బోగీలు
- ఆ బోగీలలో కిటికీలకు మెష్ లు, సీసీటీవీ కెమెరాలు
- గుర్తించేందుకు వీలుగా మహిళా బోగీలకు ప్రత్యేక రంగులు
- ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్న రైల్వేశాఖ?
మహిళా ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ కొత్త నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు రైలు చివరి భాగంలో మహిళా బోగీ (లేడీస్ కంపార్ట్ మెంట్) ఉండేది. ఇకపై, రైలు మధ్య భాగంలో ఆ బోగీని ఉంచాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ సదుపాయాన్ని సబర్బన్ రైళ్లతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో కూడా అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ చూస్తున్నట్టు తెలుస్తోంది. మహిళా బోగీలను మహిళలు వెంటనే గుర్తించేందుకు వీలుగా వాటికి ప్రత్యేకమైన రంగులు కూడా వేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. అంతేకాకుండా, మహిళల భద్రత దృష్ట్యా ఆ బోగీలలో సీసీటీవీ కెమెరాలు, కిటికీలకు మెష్ లు ఏర్పాటు చేయాలనే విషయమై అధికారులు ఇప్పటికే ఓ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. రైళ్లలో ప్రయాణించే మహిళల భద్రత కోసం రైల్వే బోర్డు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మహిళా బోగీలు రైలు చివరి భాగంలో ఉండటంతో భద్రత దృష్ట్యా వాటిలో ఎక్కేందుకు మహిళలు ఆసక్తి చూపడం లేదని సంబంధిత అధికారులు అంటున్నారు.