Pawan Kalyan: అభాగ్యులు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది: వర్ష బీభత్సంపై పవన్ కల్యాణ్
- సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందింది
- ఈ రోజుల్లోనూ వారిని రక్షించుకోలేకపోవడం దురదృష్టకరం
- ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో తరచూ విఫలం
- నా ప్రగాఢ సానుభూతి
'ప్రకృతి బీభత్సానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 మంది, ఉత్తర భారత్ లో 109 మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. "సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ప్రకృతి ప్రకోపం నుంచి మనం మన వారిని రక్షించుకోలేకవపోవడం దురదృష్టకరం. ఆకాల వర్షాలు సంభవిస్తాయని, ఉరుములు మెరుపులు భీకరంగా గర్జిస్తాయని తెలిసినప్పటికీ పౌర పాలనా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో తరచూ విఫలమవుతున్నారు.
తెలంగాణాలో 10 మంది, ఆంధ్రప్రదేశ్ లో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం చిన్న విషయం కాదు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వాలు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలన్న విషయాన్ని ఈ దుర్ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. అదేవిధంగా ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు యార్డులకు చేరిస్తే అక్కడ సరయిన వసతులు లేక ధాన్యం, మొక్కజొన్న వంటి వేలాది టన్నుల పంట వర్షానికి తడిసిపోవడం దురదృష్టకరం.
వర్ష బీభత్సానికి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత ఆర్థిక సాయాన్నిఅందచేయాలి. అదే విధంగా బాధిత రైతులకు వారు నష్టపోయిన మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలి. ఈ ఆపత్కాలంలో జన సైనికులు బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ..వారి కుటుంబాలకు నా తరపున, జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను" అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.