nobel prize: నోబెల్ చరిత్రలోనే అనూహ్య నిర్ణయం... ఈ ఏడాది సాహిత్యంలో అవార్డు ఇవ్వడం లేదని ప్రకటన
- వచ్చే ఏడాదికి వాయిదా
- 2019లోనే రెండు సంవత్సరాలకు కలిపి అవార్డుల ప్రదానం
- స్వీడిష్ అకాడమీ ప్రకటన
సాహిత్య విభాగంలో 2018 సంవత్సరానికి నోబెల్ అవార్డును ఇవ్వడం లేదని స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. 2019 సంవత్సరంలోనే 2018 సంవత్సరానికి కూడా అభ్యర్థిని ఖరారు చేసి అవార్డులను జారీ చేస్తామని ఈ రోజు తెలిపింది. తమ ప్రయత్నాలన్నీ మసకబారిన అకాడమీ ప్రతిష్టను పునరుద్దరిండంపైనే కేంద్రీకరించినట్టు పేర్కొంది. అవార్డుకు రచయితలు దొరక్క కాదని స్పష్టం చేసింది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 70 ఏళ్ల కాలంలో నోబెల్ సాహిత్య అవార్డును వాయిదా వేయడం ఇదే మొదటి సారి. కేవలం సాహిత్య అవార్డుకే ఇది పరిమితమని, 2018 సంవత్సరంలో ఇతర అవార్డులకు ఇది వర్తించదని స్వీడిష్ అకాడమీ స్పష్టం చేసింది. స్వీడిష్ అకాడమీ సభ్యురాలు కేథరీనా ఫ్రోస్టర్సన్ భర్త జీన్ క్లౌడ్ ఆర్నాల్ట్ అనే ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ పై లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతోను, ముందుగానే కొన్ని అవార్డులకు పేర్లు లీక్ కావడంతోనూ విమర్శలు రావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.