kirpan: పరీక్షా హాల్లోకి కత్తి, తలపాగా తీసుకెళ్లొచ్చు... సిక్కు విద్యార్థులకు ఢిల్లీ హైకోర్టులో ఊరట
- వీటిని సీబీఎస్ఈ నిషేధించడం కుదరదు
- వీటి దుర్వినియోగంపై భయం అనవసరం
- ఈ తరహా ఘటన ఒక్కటైనా ఉందా?
- ఢిల్లీ హైకోర్టు ప్రశ్నలు
సిక్కు వైద్య ప్రవేశ అభ్యర్థులకు ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. నీట్ పరీక్షా కేంద్రంలోకి తలపాగా, కిర్పాణ్ (కత్తి వంటిది) తీసుకెళ్లొచ్చని స్పష్టం చేసింది. అయితే, వాటితో వెళ్లే వారు గంట ముందుగా తెలియజేయాలని సూచించింది. వీటిని పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లకుండా సీబీఎస్ఈ నిషేధించడం సరికాదని పేర్కొంది. జస్టిస్ ఎస్.రవీంద్ర, జస్టిస్ ఏకే చావ్లాతో కూడిన ధర్మాసనం ఇందుకు సంబంధించిన వ్యాజ్యంపై విచారణ జరిపింది.
అనుచితమైన ఈ తరహా మెటాలిక్ వస్తువులను తీసుకెళ్డాన్ని నిషేధించినట్టు సీబీఎస్ఈ పేర్కొనగా దాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. అస్పష్టమైన భయంతో ఈ తరహా నిషేధాన్ని అమలు చేయడం కుదరని స్పష్టం చేసింది. ‘‘పరీక్షకు వచ్చిన వారు వాటితో ఏదైనా చేస్తారన్న భయం అనవసరం. వీటిని దుర్వినియోగం చేసిన ఘటన ఒక్కటైనా ఉందా?’’ అని కోర్టు ప్రశ్నించింది.