Karnataka: క్షంతవ్యులం... మీ ఆదేశాలు పాటించలేము: సుప్రీంకోర్టును ధిక్కరించిన కర్ణాటక సర్కారు
- 4 టీఎంసీల నీరివ్వాలని సుప్రీం ఆదేశం
- అంత నీరు లేదన్న కర్ణాటక
- ఉన్న నీరు తాగేందుకే సరిపోతుందన్న మంత్రి పాటిల్
తమిళనాడుకు వెంటనే 4 టీఎంసీల కావేరీ నీటిని వదలాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము అమలు చేయలేమని కర్ణాటక స్పష్టం చేసింది. ఇందుకు తాము క్షంతవ్యులమని చెప్పింది. నీటిని విడుదల చేయాలని అనుకున్నా, తమ వద్ద అంత నీరు లేదని రాష్ట్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. మే నెల అవసరాలకు గాను నాలుగు టీఎంసీల నీటిని ఇవ్వాలని సుప్రీంకోర్టు నిన్న ఆదేశించిన సంగతి తెలిసిందే.
కావేరీ నదిపై ఉన్న నాలుగు రిజర్వాయర్లలో మొత్తం కలిపి తమ వద్ద 9 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, అంతకుమించి నీరు లేదని, ఉన్న నీరు కన్నడ ప్రజల తాగునీటి అవసరాలకే చాలదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో కోర్టు ఆదేశాలను పాటించలేమని, ఇదే విషయాన్ని అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేస్తామని, నీటి లభ్యత పెరిగితే విడుదల చేస్తామని చెబుతూ, మీడియాకు ఆయనో వీడియో సందేశాన్ని పంపించారు.