TRSV: ఉద్యమం నాటి కేసు: టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేత మున్నూరు రవికి జైలు శిక్ష
- 2012లో మహబూబ్ నగర్ లో నిరసనలు
- పోలీసుల విధులకు ఆటంకం
- ఆరేళ్ల విచారణ తరువాత తీర్పు
తెలంగాణ ఉద్యమం చురుకుగా సాగుతున్న వేళ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో టీఆర్ఎస్వీ (తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం) నేత మున్నూరు రవికి ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. టీఆర్ఎస్వీలో ప్రధాన కార్యదర్శిగా రవి పని చేస్తున్న వేళ, 2012 సెప్టెంబర్ 26న మహబూబ్ నగర్ లో భారీ ఎత్తున నిరసన ర్యాలీ జరిగింది.
అప్పట్లో బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ వేణుగోపాల్ రెడ్డి, తన విధులకు మున్నూరు రవి ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. విచారణ దాదాపు ఆరేళ్లు సాగగా, జిల్లా జూనియర్ సివిల్ జడ్జి దీప్తి తీర్పు వెలువరించారు. తీర్పు వెలువడిన వెంటనే రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకోగా, తనకు రెండు రోజుల గడువు కావాలని పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం శనివారం వరకూ గడువిచ్చింది.