apollo: ‘రంగస్థలం’లో నా భర్త చెవిటివాడిగా నటించారు.. వినికిడి విలువేంటో నాకు తెలుసు!: ఉపాసన
- హియరింగ్ ఇంపైర్డ్ గర్ల్ చైల్డ్ ప్రాజెక్ట్ మూడో వార్షికోత్సవం
- వినికిడి సమస్యతో బాధపడే చిన్నారుల గురించి మాకు తెలియజేయండి
- మా వంతు సాయం చేస్తాం
‘రంగస్థలం’ సినిమాలో తన భర్త చెవిటివాడిగా నటించారని, వినికిడి విలువేంటో తనకు తెలుసని ప్రముఖ హీరో రామ్ చరణ్ భార్య, అపోలో ఆసుపత్రి ఫౌండేషన్ చైర్మన్ ఉపాసన అన్నారు. అపోలో మెడికల్ కళాశాలలో హియరింగ్ ఇంపైర్డ్ గర్ల్ చైల్డ్ ప్రాజెక్ట్ మూడో వార్షికోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఉపాసన పోస్ట్ చేశారు.
ఉపాసనతో పాటు డాక్టర్ వినయ్ కుమార్, ఐపీఎల్ సన్ రైజర్స్ జట్టు సభ్యులు రషీద్ ఖాన్, కార్లోస్ బ్రాత్ వయిట్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, టావ్ మూడీ పాల్గొన్నారు. హియరింగ్ ఇంపైర్డ్ గర్ల్ చైల్డ్ ప్రాజెక్ట్ కు సన్ రైజర్స్ జట్టు మద్దతుగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని ఉపాసన అన్నారు. వినికిడి సమస్యతో బాధపడుతున్న ఈ చిన్నారులు ఇప్పుడు అందరిలా చక్కగా వినగలుగుతున్నారని, ఈ తరహా సమస్యలు ఉన్న చిన్నారులు తమకు తెలియజేస్తే వారికి తమ వంతు సాయంగా వినికిడి ఉపకరణాలు తప్పకుండా అందజేస్తామని ఉపాసన తెలిపారు.
ఈ సందర్భంగా టామ్ మూడీ మాట్లాడుతూ, ఒక మంచి పనితో అనుబంధం కలిగి ఉండడమనేది చాలా సంతోషం కలిగించిందని అన్నారు. అపోలో ఆసుపత్రి ఈఎన్ టీ అధిపతి డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది మనదేశంలో జన్మిస్తున్న ప్రతి వెయ్యి మందిలో నలుగురు లేదా ఐదుగురు శిశువులు వినికిడి లోపాలతో జన్మిస్తున్నారని, వీరికి మూడు నుంచి ఐదేళ్లలోపు చికిత్స అందించకపోతే వారు తమ జీవితాంతం వినికిడి, మాట్లాడలేకపోవడం వంటి లోపాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.