maoist: బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసన.. నేడు మావోయిస్ట్ ల బంద్
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తున్న మావోయిస్టులు
- దేశ వ్యాప్త బంద్ కు పిలుపు
- ఒడిశా, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ భద్రత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని, బూటకపు ఎన్ కౌంటర్లను నిరసిస్తూ నేడు దేశ వ్యాప్త బంద్ కు మావోయిస్ట్ లు పిలుపునిచ్చారు. ఈ బంద్ నేపథ్యంలో ఒడిశా, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. భద్రతను కట్టుదిట్టం చేసింది. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం మండలాల్లో భద్రతాదళాలు భారీ ఎత్తున తనిఖీలు చేపట్టాయి.
మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాలో, తెలంగాణ, మహారాష్ట్ర బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండటం గమనార్హం. కాగా, భద్రాచలం - చర్ల ప్రధాన రహదారి సత్యనారాయణపురం దగ్గర కల్వర్ట్ ను మావోయిస్టులు పేల్చి వేశారు. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ఎలాంటి విధ్వంసకర ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.