Andhra Pradesh: నిర్దేశించిన గడువులోగా ప్రపంచ బ్యాంకు పనులన్నీ పూర్తి చేయాలి: ఏపీ సీఎస్ దినేష్ కుమార్

- పలు శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులతో సమీక్షా సమావేశం
- నిధుల విడుదలలో జాప్యం జరిగితే నా దృష్టికి తీసుకురావాలి
- ప్రతినెలా కలెక్టర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆదేశం
ఏపీలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న పనుల్లో నిర్లక్ష్యం చూపొద్దని, నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు నిధులపై చేపట్టిన వివిధ ప్రాజెక్టుల ప్రగతిపై పలు శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన పనులపై ఆ సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

నిర్దేశించిన లక్ష్యంలోగా పనులు చేయాలని ఆయా శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. నిధుల విడుదలలో జాప్యం చోటుచేసుకుంటే తన దష్టికి తీసుకురావాలని, ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇందుకోసం ప్రతినెలా కలెక్టర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని, నెలవారీ రిపోర్టులు తయారు చేయాలని ఆదేశించారు.