Telangana: వేసవి సెలవులలో తరగతులు నిర్వహిస్తున్న తెలంగాణలోని కార్పొరేట్ కళాశాలలపై చర్యలు !

  • కార్పొరేట్ కళాశాలలపై ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారుల తనిఖీలు 
  • హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తనిఖీలు
  • ఆయా యాజమాన్యాలకు నోటీసులు ..  కళాశాలలకు తాళాలు 

వేసవి సెలవులలో తరగతులు నిర్వహిస్తున్న తెలంగాణలోని కార్పొరేట్ కళాశాలలపై తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వేసవి సెలవులలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులను నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై అధికారులు తనిఖీలు నిర్వహించారు.

విద్యార్థులను బయటకు పంపి వేసి, ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి, ఆయా కళాశాలలకు తాళాలు వేసినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు నుండి ప్రథమ సంవత్సరం ప్రవేశాల ప్రకటన వెలువడక ముందే విద్యార్థులను, తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రవేశాలు నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్టు తెలంగాణా రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ఆ ప్రకటనలో పేర్కొంది.

ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టరు ఎ. అశోక్, ఐఏఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు మేడ్చల్ జిల్లా ఇంటర్ విద్యాధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో 16 కళాశాలలపై, హైదరాబాద్ జిల్లా, ఇంటర్ విద్యాధికారి జయప్రద ఆధ్వర్యంలో 16  కళాశాలలపై, రంగారెడ్డి జిల్లా, ఇంటర్ విద్యాధికారి  వెంక్య నాయక్ ఆధ్వర్యంలో 14 కళాశాలలపై ఆకస్మిక దాడులు నిర్వహించి, తాళాలు వేశామని, ఈ తనిఖీల్లో ఇంటర్ బోర్డు నియమించిన 27 తనిఖీ బృందాలు పాల్గొన్నాయని తెలిపింది. 

Telangana
intermediate board
  • Loading...

More Telugu News