Maharashtra: పూణేలోని రాజ్ భవన్ సమీపంలో ఎర్రచందనం దుంగల చోరీ!
- ఐదు ఎర్రచందనం చెట్లను నరికివేసిన దుండగులు
- ఒక్కో చెట్టు విలువ సుమారు రూ.20 వేలు
- ఒక్కో చెట్టు వయసు ఎనిమిది నుంచి పదేళ్లు
మహారాష్ట్ర గవర్నర్ వర్షాకాలపు విడిదిగా వున్న పూణే నగరంలోని రాజ్ భవన్ పరిసరాల్లో విలువైన ఎర్రచందనం చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికివేశారు. గత నెల 30న జరిగిన ఈ సంఘటన సమాచారాన్ని గవర్నర్ విద్యాసాగర్ రావుకు రాజ్ భవన్ సిబ్బంది తెలియజేసింది. రాజ్ భవన్ పరిసరాల్లోని ఐదు ఎర్రచందనం చెట్లను వాటి మొదళ్ల వరకు నరికివేసిన గుర్తుతెలియని వ్యక్తులు వాటిని ఎత్తుకుపోయారని, ఒక్కో చెట్టు విలువ సుమారు రూ.20 వేల వరకు ఉంటుందని రాజ్ భవన్ సిబ్బంది తెలిపారు.
నరికివేతకు గురైన ఒక్కో చెట్టు వయసు ఎనిమిది నుంచి పది సంవత్సరాల వరకు ఉంటుందని సమాచారం. రాజ్ భవన్ కు అత్యంత సమీపంలోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. అయినప్పటికీ, దుండగులు ఈ చెట్లను నరికివేయడం గమనార్హం. ఈ సంఘటనపై చతుశృంగి పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రాజ్ భవన్ సమీపంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. రెండేళ్ల కాలంలో ఈ ఘటన చోటుచేసుకోవడం రెండోసారి. సెక్యూరిటీ సిబ్బంది, సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ ఎంతో ఖరీదు చేసే ఎర్రచందనం కోసం గుర్తుతెలియని వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని రాజ్ భవన్ సిబ్బంది అంటున్నారు.