bride: 'పెళ్లికొడుకు కావలెను'... ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతున్న అమ్మాయి పోస్ట్!
- కేరళ అమ్మాయి వినతి
- కులం కూడా పట్టించుకోనని ప్రకటన
- మంచి వ్యక్తి ఉంటే తనకు తెలియజేయండని వ్యాఖ్య
- విపరీతంగా వైరల్ అవుతోన్న పోస్ట్
వరుడు లేక వధువు కావాలంటే మ్యాట్రిమోనియల్ సైట్‌లను సంప్రదిస్తాం.. లేదంటే వార్తాపత్రికల్లో వచ్చే పెళ్లి ప్రకటనల్లో వేయించుకుంటాం. కానీ, వరుడు కావాలంటూ ఓ కేరళ అమ్మాయి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ ద్వారా ప్రకటన చేసి వార్తల్లోకెక్కింది. ఆ రాష్ట్రంలోని మలప్పురంకు చెందిన జ్యోతి కేజీ (28) అనే యువతి.. తన వయసు 28 సంవత్సరాలని, తన తల్లిదండ్రులు మరణించారని తన మాతృభాష మలయాళంలో పేర్కొంది.
తనకు ఒక సోదరుడు ఉన్నాడని, ఆయన ముంబయిలో సీనియర్ యాడ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడని తెలిపింది. తాను బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేశానని, ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నానని, తన ఫేస్‌బుక్ పోస్ట్ చూసిన వారు.. తమకు తెలిసి ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే తనకు తెలియజేయండని పేర్కొని, చివరకు తాను కులం, జాతకాల గురించి పట్టించుకోనని చెప్పింది.
అలాగే, ఫేస్‌బుక్‌కి ఓ వినతి చేసుకుంది. ఫేస్‌బుక్‌లో మ్యాట్రిమోనియల్ ఫీచర్‌ను ప్రారంభించాలని, ఆ సంస్థ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌కు విన్నపం చేస్తున్నట్లు పేర్కొంది. ఇలా చేస్తే ఫేస్‌బుక్ యూజర్లు తగిన జీవితభాగస్వామిని ఎన్నుకునేందుకు మార్గం సులువవుతుందని తెలిపింది. మలయాళంలో ఇలా రాయడమే కాకుండా తన మాటలను ఓ వీడియో ద్వారా కూడా వినిపించింది. ఈ పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది.