beer: బీరు ప్రియులకు చేదు వార్త.. తెలంగాణలో పెరగనున్న ధరలు
- ధరలు పెంచాలని రేట్ కాంట్రాక్ట్ కమిటీ సిఫారసు
- బెవరేజెస్ కార్పొరేషన్ ఆమోదం తెలిపాక.. సీఎం వద్దకు ఫైల్
- కేసీఆర్ సంతకం తర్వాత పెరగనున్న ధరలు
తెలంగాణలోని బీరు ప్రియులకు చేదు వార్త. బీరు ధరలను 9 నుంచి 10 శాతం మేర పెంచాలంటూ 'రేట్ కాంట్రాక్ట్ అండ్ నెగోషియేషన్స్ కమిటీ' సిఫారసు చేసింది. లైట్ (లాగర్) బీరుపై 9 శాతం, స్ట్రాంగ్ బీరుపై 10 శాతం పెంచాలని సూచించింది. బేసిక్ ధరను పెంచాలంటూ బ్రూవరీ కంపెనీలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరను నిర్ణయించేందుకు రేట్ కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
రిటైర్ట్ జడ్జి, రిటైర్డ్ ఐఏఎస్, చార్టెర్డ్ అకౌంటెంట్ తో కూడిన ఈ త్రిసభ్య కమిటీ... బ్రూవరీ కంపెనీల నుంచి విన్నపాలను స్వీకరించింది. ఎంతమేరకు బేస్ ప్రైజ్ ను పెంచవచ్చనే విషయంపై చర్చించింది. ఈ సందర్భంగా కొన్ని కంపెనీలు 12 శాతం, మరి కొన్ని కంపెనీలు 15 శాతం పెంచాలంటూ కోరాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న కమిటీ... చివరకు 9, 10 శాతం పెంచాలంటూ ప్రభుత్వానికి సూచించింది.
ప్రస్తుతం ఈ సిఫారసులు ఎక్సైజ్ కమిషనరేట్ కు చేరాయి. దీనికి తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కు చెందిన బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలపాల్సి ఉంది. అనంతరం ఈ ఫైలు ముఖ్యమంత్రి వద్దకు వెళుతుంది. సీఎం కేసీఆర్ సంతకం చేయగానే బీరు ధరలు పెరుగుతాయి.