Rajasthan: రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లలో దుమ్ముతో కూడిన కుంభవృష్టి... 70 మందికి పైగా మృతి
- రెండు రాష్ట్రాలు అతలాకుతలం
- స్తంభించిన జనజీవనం
- ఆగ్రా ప్రాంతంలో 36 మంది మృతి
రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను దుమ్ము, ధూళితో కూడిన కుంభవృష్టి వర్షం అతలాకుతలం చేయగా, ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం సుమారు 70 మందికి పైగా మరణించారు. ఒక్క ఆగ్రా ప్రాంతంలోనే 36 మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీని కూడా అతివృష్టి తాకినప్పటికీ, ప్రాణనష్టం నమోదుకాలేదు. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
తూర్పు రాజస్థాన్ ప్రాంతంలోని అల్వార్, ధోల్ పూర్, భరత్ పూర్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇక్కడ 27 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. పలు చెట్లపై పిడుగులు పడ్డాయని, కరెంటు స్తంభాలు విరిగి పడటంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేదని తెలిపారు. పాత ఇళ్లు చాలా కుప్పకూలాయని, ఈ కారణంతోనే మృతుల సంఖ్య అధికంగా ఉందని అధికారులు తెలిపారు.
కాగా, అతివృష్టి, అకాల వర్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. మృతులకు సంతాపం తెలుపుతున్నట్టు ప్రకటించారు. నిరాశ్రయులైన వారిని ఆదుకోవాలని అధికారులను మోదీ ఆదేశించారు.