Ram Nath Kovind: అవార్డుల ప్రదానానికి గంట సమయం మాత్రమే కేటాయించిన రాష్ట్రపతి.. విమర్శలు!
- ఈ సాయంత్రం 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- అవార్డులను గెలుచుకున్న 140 మంది
- కేవలం 11 మందికి మాత్రమే అవార్డులను బహూకరించనున్న రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీసుకున్న ఒక నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు జరగనున్నాయి. విజేతలందరూ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను స్వీకరించాల్సి ఉంది. అయితే, ఈ కార్యక్రమానికి కోవింద్ కేవలం గంట సమయం మాత్రమే ఇచ్చారు. కేటాయించిన సమయంలో ఆయన కేవలం 11 మందికి మాత్రమే అవార్డులను అందిస్తారని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.
మరోవైపు, మొత్తం 140 మంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో, 11 మంది మినహా మిగిలినవారికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు స్వీకరించే అవకాశం లభించదు. దీంతో, అవార్డు విజేతలు చాలామంది తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అవార్డుల వేడుకను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. గత ఏడాది జరిగిన కార్యక్రమంలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజేతలందరికీ అవార్డులను అందజేశారని... అలాంటిది కోవింద్ కు వచ్చిన అభ్యంతరం ఏమిటని వారు ప్రశ్నించారు.
మరోవైపు, వచ్చే ఏడాది నుంచి రాష్ట్రపతి కేవలం ఒక్క అవార్డు మాత్రమే బహూకరిస్తారని... మిగిలిన అవార్డులను మంత్రులతో ప్రదానం చేయించాలంటూ రాష్ట్రపతి కార్యాలయం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ నిర్ణయాలన్నీ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.