Karnataka: బీజేపీకి ఆరెస్సెస్ షాక్.. కర్ణాటకలో 70 సీట్లు మాత్రమే వస్తాయన్న అంతర్గత నివేదిక

  • బీజేపీ నేతలకు మింగుడు పడని ఆరెస్సెస్ నివేదిక
  • కాంగ్రెస్‌కు 115-120 సీట్లు
  • అమిత్‌షాకు నివేదిక అందజేత

కర్ణాటకలో గెలవడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పాతుకుపోవాలని భావిస్తున్న బీజేపీకి ఆరెస్సెస్ షాకిచ్చే నివేదిక ఇచ్చింది. ఈ నెల 12న జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి 70కి మించి ఒక్క సీటు కూడా రాదని ఆరెస్సెస్ నిర్వహించిన అంతర్గత సర్వేలో తేలింది. ఈ సర్వే నివేదికను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు దక్షిణ భారత ప్రాంతీయ ప్రముఖ్ వి.నాగరాజు బెంగళూరులో అందజేశారు.

బీజేపీకి 70, కాంగ్రెస్‌కు 115-120, జేడీఎస్‌కు 29-34 సీట్లు వచ్చే అవకాశం ఉందని నివేదికలో ఉండడాన్ని చూసి నేతలు కంగుతిన్నారు. దళితులు, బలహీన వర్గాల వారిని బీజేపీ ఆకర్షించలేకపోయిందని నివేదికలో పేర్కొన్నారు. అలాగే, గాలి సోదరులకు పార్టీ టికెట్లు ఇవ్వడం, అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రో ధరలు, జీఎస్టీ, నిరుద్యోగ సమస్య.. తదితర అంశాలు బీజేపీ నుంచి ప్రజలను దూరం చేశాయని నివేదికలో పేర్కొన్నారు.  
 
కర్ణాటక ఎన్నికలపై మూడు నెలలుగా సర్వే నిర్వహిస్తున్న బీజేపీ దాని ప్రకారమే అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. అయినప్పటికీ తాజా నివేదిక నేతలకు మింగుడు పడడం లేదు. తాజాగా ఓ కన్నడ పత్రిక నిర్వహించిన సర్వేలోనూ బీజేపీ అధికారంలోకి రాదని తేలింది. ఈ కారణంగానే మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడను మచ్చిక చేసుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News