akhilesh: దేశంలో మార్పునకు బీజం పడింది: హైదరాబాద్‌లో అఖిలేష్
- ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్నాం
- బీజేపీని నిలువరించే శక్తి వాటికే ఉంది
- దేశంలో ఇప్పటికీ సాగు, తాగునీటి సమస్యలున్నాయి
- నోట్ల రద్దుతో మార్పు వస్తుందని బీజేపీ చెప్పింది జరిగిందా?
కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో కేసీఆర్‌తో సమావేశం ముగిసిన తరువాత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ... కేసీఆర్ తలపెట్టిన గుణాత్మక మార్పును సమాజ్‌వాదీ పార్టీ సమర్థిస్తోందని అన్నారు. ఇది కేవలం పార్టీలను ఏకం చేయడమే కాదని, ప్రగతిశీల భావనలు కలిగిన నాయకుల కలయిక అని, దేశంలో మార్పునకు బీజం పడిందని అన్నారు.
తమ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నిల్లో బీజేపీ ఓడిపోయిందని, నోట్ల రద్దుతో పెద్ద మార్పు వస్తుందని బీజేపీ చెప్పిన మాటలు నిజం అయ్యాయా? అని అఖిలేష్ విమర్శించారు. దేశంలో జరగాల్సిన ఆర్థిక వృద్ధి తగిన స్థాయిలో లేదని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ సాగు, తాగునీరు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయని చెప్పారు. తాము ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్నామని, బీజేపీని నిలువరించే శక్తి వాటికే ఉందని అన్నారు.