KTR: గడ్డం పెంచినోళ్లంతా గబ్బర్ సింగ్‌లు అయిపోతారా? : కేటీఆర్
- టీపీసీసీ చీఫ్‌పై కేటీఆర్ విసుర్లు
- వారు ముగ్గురూ ఆకాశం నుంచి దిగొచ్చామనుకుంటున్నారని విమర్శ
- వచ్చే ఎన్నికల్లో గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మంత్రి
గడ్డం పెంచినోళ్లంతా గబ్బర్ సింగ్‌లు కాలేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మేడే సందర్భంగా మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. అభివృద్ధి నిరోధకులుగా మారారని ధ్వజమెత్తారు. కొందరేమో ప్రగతి భవన్ గేట్లు విరగ్గొడతామని అంటారని, మరొకరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీయబోనని శపథం చేస్తారని ఎద్దేవా చేశారు. గడ్డం పెంచినోళ్లంతా గబ్బర్ సింగ్‌లు కాలేరని పరోక్షంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
గడ్డం పెంచుకుంటాననే వాళ్లు ఉంటే ఏంటి? ఎక్కడికైనా పోతే ఏంటని, వారితో తమకు వచ్చేది ఏముందని అన్నారు. ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, షబ్బీర్‌లు ఆకాశం నుంచి దిగి వచ్చిన గంధర్వుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. మూడున్నరేళ్లుగా టీఆర్ఎస్‌ను ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారని, మరి ఏళ్లపాటు పాలన సాగించిన వారినేమనాలని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు.